సాగర్‌లో కేసీఆర్‌ బహిరంగసభ?

నాగార్జునసాగర్ శాసనసభ నియోజకవర్గం ఉపఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సిఎం కేసీఆర్‌ ఈనెల 22-24 తేదీల మద్య ఆ నియోజకవర్గం పరిధిలోని హాలియా మండల కేంద్రంలో బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ శనివారం ప్రగతి భవన్‌లో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ప్రజాప్రతినిధులు, పార్టీ సీనియర్ నాయకులతో ఈ సభ నిర్వహణ గురించి చర్చించారు. మళ్ళీ నిన్న మంత్రి జగదీష్ రెడ్డితో కూడా ఇదే విషయంపై లోతుగా చర్చించారు. సభ నిర్వహణ కొరకు కర్నె ప్రభాకర్, టిఆర్ఎస్‌ ప్రధాన కార్యదర్శులు సోమ భరత్‌కుమార్ గుప్తా, తక్కెళ్ళపల్లి రవీందర్ రావులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. 

దుబ్బాక, గ్రేటర్ ఓటముల నేపధ్యంలో ఈ ఉపఎన్నికలు టిఆర్ఎస్‌కు అత్యంత ప్రతిష్టాత్మకం కానున్నాయి కనుక సిఎం కేసీఆర్‌ పాల్గొనబోయే ఈ సభకు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కనీసం లక్షన్నరమంది జనసమీకరణ చేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నట్లు తెలుస్తోంది. దానిలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రజలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళు, రోడ్లు, ఆసుపత్రులు వంటి అనేక వరాలు ప్రకటించే అవకాశం ఉంది. ఈ సభ ఎప్పుడు నిర్వహించేది టిఆర్ఎస్‌ ఒకటి రెండు రోజులలో ప్రకటించవచ్చు.