
రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ నిత్యం సిఎం కేసీఆర్ను లక్ష్యంగా చేసుకొని అనుచిత విమర్శలు చేస్తుండటంపై టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, శానంపూడి సైదిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో సోమవారం మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్రంలో ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పధకాలను కేంద్రమంత్రులు పొగుడుతుంటే, రాష్ట్రంలో బిజెపి నేతలకు అవేవీ కనిపించడం లేదు. బిజెపి రాష్ట్రంపైకి కొన్ని పిచ్చికుక్కలను ఉసిగొల్పింది. అవి పిచ్చిపట్టినట్లు అరుస్తున్నాయి. కేసీఆర్ ముఖ్యమంత్రి అనే ఆలోచన కూడా లేకుండా బండి సంజయ్ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. జనాలతో మైండ్ గేమ్స్ ఆడుతూ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని పగటి కలలు కంటున్నారు. ఇన్నేళ్ళలో కేంద్రం దేశానికి రాష్ట్రానికి ఏమిచేసిందో చెప్పలేరు...రాష్ట్రానికి ఏమిచ్చిందో చెప్పలేరు. కానీ నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంటారు. బండి సంజయ్ ఇప్పటికైనా తన తీరు మార్చుకోకపోతే ప్రజలే తగినవిధంగా బుద్ది చెపుతారు,” అని సైదిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘ప్రగతి భవన్ మాఫియాలకు అడ్డా’ అని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై గాదరి కిషోర్ స్పందిస్తూ, “అసలు మోడీ ప్రభుత్వంలోనే అనేకమంది దొంగలు, అవినీతిపరులు ఉన్నారు. మోడీ మంత్రివర్గంలోనే హత్యలు, అత్యాచారాలు చేసినవారు 25 మంది ఉన్నారు. నేడు కేంద్రహోంమంత్రిగా ఉన్న అమిత్ షాను ఒకప్పుడు గుజరాత్ రాష్ట్రం నుంచి వెలివేయలేదా?మాఫియాను పెంచి పోషిస్తున్నది మోడీ ప్రభుత్వమే. విదేశాలలో నల్లధనం తెచ్చి దేశంలో పేదలకు పంచిపెడతానని చెప్పిన నరేంద్రమోడీ దేశంలోని డబ్బును విదేశాలకు తరలిపోయేలా చేస్తున్నారు. గురివింద గింజ తన నలుపు ఎరుగదన్నట్లు కనుక బండి సంజయ్ కూడా తన పార్టీలోని ఈ అవకారాలను గుర్తించకుండా తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్న సిఎం కేసీఆర్పై నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇకనైనా ఆయన నోటిని అదుపులో ఉంచుకొంటే మంచిది,” అని తీవ్ర స్వరంతో హెచ్చరించారు.