
కేంద్రప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలపై సుప్రీంకోర్టు మంగళవారం స్టే విధించింది. అంతేగాక ఈ సమస్యపై అధ్యయనం చేసి సుప్రీంకోర్టుకు నివేదిక ఇచ్చేందుకు నలుగురు సభ్యులతో ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. దానిలో హర్‌సిమ్రత్ మాన్, అశోక్ గులాటి, ప్రమోద్ జోషి, అనిల్ ధన్వంత్ సభ్యులుగా ఉంటారని తెలిపింది. రైతులు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించడానికి కారణాలు ఏమిటి?ఆ చట్టాలలో ఏమైనా లోపాలున్నాయా? వాటి అమలులో లాభనష్టాలు ఏమిటి? వాటితో ఎటువంటి సమస్యలు తలెత్తుతాయి?వంటి అంశాలపై కమిటీ అధ్యయనం చేసి సుప్రీంకోర్టుకి నివేదిక ఇస్తుందే తప్ప ఇది రైతులకు ఎటువంటి హామీ లేదా భరోసా ఇవ్వబోదని, అలాగే నివేదిక ఆధారంగా కేంద్రప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టడానికి కాదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఏ.బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ముందే స్పష్టం చేసింది.
గత 45 రోజులుగా ఢిల్లీలో గజగజ వణికిస్తున్న చలిలో వేలాదిమంది రైతులు, వారి కుటుంబాలతో సహా ఆందోళనలు చేస్తున్నారు. కానీ ఈనెల 26న గణతంత్ర దినోత్సవంనాడు రాజ్‌పథ్‌లో ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహిస్తామని రైతు సంఘాల నేతలు ముందే ప్రకటించారు. వ్యవసాయ చట్టలపై స్టే విధించినందున ట్రాక్టర్ ర్యాలీ ఆలోచనను విరమించుకోవాలని, అందరూ ముఖ్యంగా వృద్దులు, మహిళలు, పిల్లలు తమ తమ ఇళ్ళకు తిరిగివెళ్లిపోవాలని జస్టిస్ ఎస్.ఏ.బాబ్డే విజ్ఞప్తి చేసారు. ట్రాక్టర్ ర్యాలీపై ఢిల్లీ పోలీసులు వేసిన పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయవలసిందిగా రైతుసంఘాల నేతలకు నోటీసు జారీ చేసారు.