
విదేశాలలో పనిచేస్తున్న, స్థిరపడిన తెలంగాణవాసులకు ఓ శుభవార్త! వివిద కారణాల చేత ఆధార్ కార్డులు పొందలేకపోవడం చేత వారు ఇంతకాలం రాష్ట్రంలో ఆస్తుల క్రయవిక్రయాలు చేయడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇకపై వారు తమ పాస్‌పోర్టులను గుర్తింపు పత్రాలుగా చూపి రిజిస్ట్రేషన్లు చేసుకొనేందుకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సోమవారం ప్రగతి భవన్‌లో జరిగిన కలెక్టర్ల సమావేశంలో సిఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు భూవివాదాలపై రెవెన్యూ కోర్టులు విచారణ చేపట్టేవి. ఇకపై జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో పనిచేసే ట్రైబ్యునళ్లలో విచారించి, పరిష్కరించాలని నిర్ణయించారు. సాదాబైనామాల క్రమబద్దీకరణకు వచ్చిన దరఖాస్తులను జిల్లా కలెక్టర్లు స్వయంగా పరిశీలించి తగిన నిర్ణయాలు తీసుకోవాలని సిఎం కేసీఆర్ ఆదేశించారు. ధరణీ పోర్టల్ ప్రవేశపెట్టిన తరువాత రిజిస్ట్రేషన్లు చాలా వేగంగా, పారదర్శకంగా జరుగుతున్నందుకు సిఎం కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. కానీ దానిలో గుర్తించిన లోపాలను వారం రోజులలోగా సరిదిద్ది సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.