కోవాక్సిన్, కోవిషీల్డ్ వాక్సిన్ల రవాణా షురూ

ఈరోజు తెల్లవారుజామున పూణేలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా నుండి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఆ సంస్థఉత్పత్తి చేస్తున్న కోవిషీల్డ్ రవాణా ప్రారంభం అయ్యింది. ప్రత్యేక వాహనాలలో పూణే విమానాశ్రయానికి వాటిని చేర్చి అక్కడి నుండి వివిద రాష్ట్రాలకు కార్గో విమానాలలో రవాణా చేస్తారు. 

ఈరోజు తొలివిడతలో చంఢీఘడ్, ఢిల్లీ, అహ్మదాబాద్, గౌహతి, లక్నో, కోల్‌కతా, భువనేశ్వర్, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌, విజయవాడలకు కోవిషీల్డ్ టీకాలు రవాణా చేయబడతాయి. 

నేటి నుండే హైదరాబాద్‌లోని భారత్‌ బయోటెక్ కంపెనీ తయారుచేసిన కోవాక్సిన్ టీకాల రవాణా కూడా ప్రారంభం కానుంది. కోవాక్సిన్ టీకాలను 12 రాష్ట్రాలకు పంపిణీ చేయబోతున్నారు.       

కేంద్రప్రభుత్వం సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా నుండి 1.1 కోట్ల కొవీషీల్డ్, భారత్‌ బయోటెక్ కంపెనీ నుండి 55 లక్షల డోసుల కోవాక్సిన్ టీకాలను కొనుగోలు చేసి అన్ని రాష్ట్రాలకు పంపిణీ చేస్తోంది. ఈ నెల 16 నుండి ప్రారంభం అయ్యే తొలివిడత వాక్సినేషన్‌లో కరోనా యోధులుగా పిలువబడుతున్న వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బంది, పారిశుద్య కార్మికులకు, డిజాసస్టర్ మేనేజిమెంట్ సిబ్బందికి, పోలీసులు, హోంగార్డులకు ఇస్తారు. ఆ తరువాత భద్రతాదళాలు, పారా మిలటరీ దళాలు తదితరులకు ఇస్తారు. ఒక్కో డోసు కొవీషీల్డ్ ధర రూ.210 కాగా, కావాక్సిన్ ధర రూ. 295గా నిర్ణయించాయి. కేంద్రప్రభుత్వం తొలివిడత టీకాల కోసం ఆ రెండు కంపెనీలకు మొత్తం రూ.393 కోట్లు చెల్లిస్తోంది. తొలివిడతలో దేశవ్యాప్తంగా మొత్తం 3 కోట్లు మందికి టీకాలు వేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాబోయే 3-4 నెలల్లో సుమారు 30 కోట్ల మందికి టీకాలు వేయాలని కేంద్రప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొంది.