మేమందరం డ్రగ్ టెస్టుకి రెడీ.. మీరు రెడీయా?

నేడు శాసనమండలిలో పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్‌ గౌడ్‌ మాట్లాడుతూ బీఆర్ఎస్‌ పార్టీకి మరోసారి సవాలు విసిరారు. “రాష్ట్రంలో మాదక ద్రవ్యాలను వ్యాపింపజేసిందే మీ ప్రభుత్వం. మీ హయంలో రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి అమ్మకాలు సాగేవి.

వాటి ద్వారా మీరు వేలకోట్లు సంపాదించారు. మీ స్వార్ధం కోసం రాష్ట్రంలో యువతకి చివరికి చిన్న పిల్లలకి డ్రగ్స్ అందుబాటులోకి తెచ్చారు. మీ హయంలో స్కూల్స్, కాలేజీల వద్ద పాన్,కిరాణా దుకాణాలలో గంజాయి చాక్లెట్లు, బిస్కట్లు అమ్మకాలు జరిగిన మాట వాస్తవం కాదా? నేను ఆన్‌ రికార్డ్ ఈ మాట చెపుతున్నాను. 

అయినా రాష్ట్రంలో ఎప్పుడు ఎక్కడ డ్రగ్స్ వ్యవహారం బయటపడినా ఎప్పుడూ మీ పేరే ఎందుకు వినబడుతోంది?

మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈగల్ టీమ్‌ ఏర్పాటు చేసి మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతోంది. మీకు దమ్ముంటే కేసీఆర్‌, కేటీఆర్‌తో సహా మీరు బీ ఫార్మ్ ఇచ్చిన వాళ్ళందరూ శాసనసభకు రండి. నేను మా రేవంతన్నతో సహా అందరినీ తీసుకువస్తాను. అందరం శాసనసభ ఆవరణలోనే డ్రగ్ టెస్ట్ చేయించుకుందాము. మనకి డ్రగ్స్ అలవాటు లేదని ప్రజలకు తెలియాలి కదా? డ్రగ్ టెస్టు చేయించుకునే దమ్ముందా?" అంటూ మహేష్ కుమార్‌ గౌడ్ బీఆర్ఎస్‌ పార్టీ నేతలకు సవాలు విసిరారు.