
ఇటీవల బిజెపిలో చేరిన మాజీ కౌన్సిల్ ఛైర్మన్ స్వామిగౌడ్ మళ్ళీ సిఎం కేసీఆర్పై తీవ్ర విమర్శలు చేశారు. సోమవారం ఆయన కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులకు ఇప్పుడు టిఆర్ఎస్లో స్థానం లేదు. తెలంగాణను వ్యతిరేకించినవారు, ఉద్యమకారులను అవమానించినవారికే ఇప్పుడు ప్రభుత్వంలో.. పార్టీలో పదవులు లభిస్తున్నాయి. టిఆర్ఎస్ ప్రభుత్వానికి శాసనసభలో పూర్తి మెజార్టీ ఉన్నప్పటికీ సిఎం కేసీఆర్ మజ్లీస్ అధినేతలకు ఎందుకు భయపడుతున్నారో తెలీదు. ఓవైసీలకు సలాములు చేసే ముఖ్యమంత్రిని తెలంగాణ సమాజం కోరుకోవడం లేదు. సిఎం కేసీఆర్ హిందువుల ఆత్మాభిమానాన్ని మజ్లీస్ పార్టీకి తాకట్టు పెడుతున్నారు,” అని అన్నారు.
టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత రాజకీయంగా నిలద్రొక్కుకొనేందుకు ఉద్యమపార్టీ నుంచి ఫక్తు రాజకీయపార్టీగా మారడం తప్పు కాదని సిఎం కేసీఆర్ ఆనాడే చెప్పారు. కనుక రాష్ట్రంలో రాజకీయంగా బలపడాలనే ఏకైక లక్ష్యంతో తెలంగాణ ఉద్యమాలలో పాల్గొననివారినీ, ఉద్యమాలను వ్యతిరేకించినవారిని కూడా పార్టీలోకి తీసుకొన్నారు. పార్టీని బలోపేతం చేసుకొనేందుకు వారికి కీలకపదవులు కూడా ఇచ్చారు. రాష్ట్రంలో రాజకీయ సుస్థిరత, హైదరాబాద్లో ప్రశాంతవాతావరణం కోసం మజ్లీస్ పార్టీతో దోస్తీ చేశారు. గ్రేటర్ ఎన్నికలలో టిఆర్ఎస్-మజ్లీస్లను బూచిగా చూపించి బిజెపి హిందూ ఓటుబ్యాంకును ఆకర్షిస్తోందని గ్రహించిన సిఎం కేసీఆర్, తాత్కాలికంగా మజ్లీస్ పార్టీని దూరంపెట్టారు. ఇప్పుడు రాష్ట్రంలో బిజెపి బలపడుతుండటంతో మజ్లీస్ పార్టీతో ఇదివరకులా బహిరంగంగా దోస్తీ చేయలేని ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. కానీ టిఆర్ఎస్-మజ్లీస్ పార్టీలది విడదీయలేని దోస్తీ అని అందరికీ తెలుసు. కనుక సిఎం కేసీఆర్ టిఆర్ఎస్ను రాజకీయంగా బలోపేతం చేయడం కోసమే ఈ నిర్ణయాలన్నీ తీసుకొంటున్నారని అర్దమవుతోంది. ఈ విషయాలన్నీ సిఎం కేసీఆర్ చిరకాలం కలిసి పనిచేసిన స్వామిగౌడ్కు తెలియదనుకోలేము. కానీ ఇప్పుడు ఆయన బిజెపిలో ఉన్నారు కనుక సిఎం కేసీఆర్ నిర్ణయాలు తప్పులుగా అభివర్ణిస్తున్నారనుకోవలసి ఉంటుంది.