
హఫీజ్‌పేట భూవివాదంలో సిఎం కేసీఆర్ బందువుల కిడ్నాప్ కేసులో అరెస్టయిన ఏపీ మాజీమంత్రి భూమా అఖిలప్రియకు కోర్టులో మళ్ళీ నిరాశే ఎదురైంది. ఏడవ నెల గర్భవతిగా ఉన్న ఆమె ఆరోగ్యకారణాలతో బెయిల్ కోసం కోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు. ఈరోజు అఖిలప్రియ బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సికింద్రాబాద్ కోర్టు ఆమె ఆరోగ్య పరిస్థితిపై జైలు అధికారులు సమర్పించిన మెడికల్ రిపోర్టులను పరిశీలించిన తరువాత ఆమె బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఆమె మరికొన్ని రోజులు జైల్లో గడుపక తప్పడం లేదు. ఈ కేసులో ఆమెను ప్రశ్నించేందుకు వారం రోజులు కస్టడీ ఇవ్వాలని పోలీస్ అధికారులు కోరగా న్యాయస్థానం మూడు రోజుల కస్టడీకి మాత్రమే అనుమతించింది. ఈ కేసులో ప్రధానసూత్రధారిగా భావించబడుతున్న అఖిలప్రియ భర్త భార్గవరామ్ ఇంకా పరారీలోనే ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈరోజు ఉదయంహైదరాబాద్‌లో అతని నివాసం వద్దకు భారీగా పోలీసులు చేరుకోవడంతో ఆందోళనకు గురైన అతని తల్లితండ్రులు తమను కూడా అరెస్ట్ చేస్తారేమోననే భయంతో ఇంటికి తాళం వేసి పోలీసుల కంటబడకుండా కారులో పారిపోయారు. జైల్లో ఉన్న అఖిలప్రియను విడిపించుకోవడం కోసం ఆమె చెల్లెలు భూమా మౌనిక శతవిధాల ప్రయత్నిస్తోంది.