ఖమ్మంలో బిజెపి గెలిపించుకోగలరా? పువ్వాడ సవాల్

తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ బండి సంజయ్‌కి సవాల్ విసిరారు. ఆదివారం ఖమ్మంలో మీడియాతో మాట్లాడుతూ తాను ఎప్పుడూ మంత్రి పదవి కోరుకోలేదని, సిఎం కేసీఆర్‌ తనపై నమ్మకంతో పదవి ఇచ్చారని అన్నారు. ఎన్నికలప్పుడు కాంగ్రెస్‌, బిజెపి పర్యాటకులు వచ్చి అనేక హామీలు ఇస్తుంటారని వారి మాయమాటలను నమ్మి మోసపోవద్దని మంత్రి పువ్వాడ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్పొరేటర్‌ కాక ముందు నుంచే మమత హాస్పిటల్ ఏర్పాటు చేసి అనేక మందికి సేవలు అందించానని అన్నారు. బండి సంజయ్‌కు దమ్ము, ధైర్యం ఉంటే 2023 అసెంబ్లీ ఎన్నికల వరకు కాదు...ఖమ్మం మునిసిపల్ ఎన్నికలలోనే బిజెపిని గెలిపించి చూపమని మంత్రి పువ్వాడ సవాల్ విసిరారు. రాబోవు ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలలో తెరాసకు హస్తం పార్టీతోనే పోటీ తప్ప భాజపాతో కాదని అన్నారు. ఖమ్మం పట్టణాన్ని స్మార్ట్ సిటీ జాబితాలో చేర్చాలని కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినప్పటికీ పట్టించుకోలేదని ఆరోపించారు. ఖమ్మం మునిసిపల్ ఎన్నికల కోసం పట్టణానికి వచ్చిన ఎంపీ బండి సంజయ్‌ కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తే సంతోషిస్తామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ అన్నారు.