
బిహార్ శాసనసభ ఎన్నికలలో పోటీ చేసి 5 సీట్లు గెలుచుకొన్న మజ్లీస్ పార్టీ త్వరలో జరుగబోయే పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలలో కూడా పోటీ చేసి ఆ రాష్ట్రంలో కూడా పార్టీని విస్తరించడానికి ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మజ్లీస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ఇప్పటికే రెండుసార్లు పశ్చిమ బెంగాల్లో పర్యటించి ఎన్నికల సన్నాహాలు ప్రారంభించారు. ఆ ప్రయత్నాలలో భాగంగా పశ్చిమ బెంగాల్ మజ్లీస్ పార్టీకి తాత్కాలిక అధ్యక్షుడిగా ఎస్కె. అబ్దుల్ కలాంను నియమించారు. ఆయన నేతృత్వంలో శాసనసభ ఎన్నికలకు వెళ్లాలని ఓవైసీ భావించారు. కానీ అబ్దుల్ కలాం ఓవైసీకి ఊహించని షాక్ ఇచ్చారు. ఆయన మజ్లీస్‌కు గుడ్ బై చెప్పేసి తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. శాసనసభ ఎన్నికలు దగ్గరపడుతున్న ఈ సమయంలో కలాం పార్టీ నుంచి వెళ్ళిపోయి ప్రత్యర్ధి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చేరడం మజ్లీస్‌కు పెద్ద దెబ్బే అని చెప్పవచ్చు.