
ఒకప్పుడు హైదరాబాద్ అంటే చారిత్రిక ప్రాధాన్యం ఉన్న నగరంగా ఉండేది. ఆ తరువాత ఫార్మా, ఐటి కంపెనీలు రావడంతో వాటికి కేంద్రంగా మారింది. ఈజ్ ఆఫ్ దూయింగ్ బిజినెస్‌లో నెంబర్ స్థానంలో నిలుస్తుండటంతో అమెజాన్ వంటి పెద్దపెద్ద వ్యాపార సంస్థలకు కేంద్రంగా మారిందిప్పుడు. శాస్త్ర, సాంకేతిక రంగాలలో కూడా దూసుకుపోతుండటంతో కేంద్రప్రభుత్వం హైదరాబాద్ నగరాన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ క్లస్టర్‌గా గుర్తిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది.
శాస్త్ర, సాంకేతిక రంగాలలో దేశాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ సలహా మండలిని ఏర్పాటు చేశారు. అది దేశంలో సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ రంగాలలో అభివృద్ధిపధంలో దూసుకుపోతున్న నగరాలను సైన్స్ అండ్ టెక్నాలజీ క్లస్టర్లుగా గుర్తించి వాటిలో ఆయా రంగాలలో దేశాభివృద్ధికి దోహదపడే మరిన్ని పెద్ద కంపెనీలు ఏర్పాటు అయ్యేలా చేస్తుంది. దేశంలో ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, పూణే నగరాలను సైన్స్ అండ్ టెక్నాలజీ క్లస్టర్‌గా గుర్తించినట్లు కేంద్రప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర శాస్త్రసాంకేతిక విభాగం ప్రధాన సలహాదారు కె.విజయరాఘవన్, ఆ విభాగం కార్యదర్శి డాక్టర్ అరవింద మిత్ర తదితరులు నాలుగు రాష్ట్రాల ఐటి, పరిశ్రమల మంత్రులతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సమావేశమయ్యారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, హైదరాబాద్ నగరానికి ఈ తాజా గుర్తింపు ద్వారా లైఫ్ సైన్సస్, డిజిటల్ టెక్నాలజీ, ఆధునిక వ్యవసాయం రంగాలు మరింత అభివృద్ధి సాధించేందుకు అవకాశాలు లభిస్తాయని అన్నారు. రాబోయే 5 ఏళ్ళలో తెలంగాణలో ఈ మార్పులు... వాటి ప్రతిఫలాలు మరింత స్పష్టంగా కనిపిస్తాయని మంత్రి కేటీఆర్ అన్నారు.