కేటీఆర్‌ గో బ్యాక్...కిషన్ రెడ్డి గో బ్యాక్!

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఈ రోజు హైదరాబాద్‌ వివిద ప్రాంతాలలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు కూడా పాల్గొన్నారు. దోమలగూడ లోని జిహెచ్ఎంసి జోనల్, డిప్యూటీ కమిషనర్ భవనానికి ఈరోజు శంకుస్థాపన చేశారు. అలాగే లింగంపల్లి లంబాడి తండ రెండు పడక గదుల ఇళ్లను లబ్ధిదారులకు అందజేశారు. ఈ పర్యటనలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. కేంద్రప్రభుత్వం అందిస్తున్న నిధులతో చేపడుతున్న ఈ పధకాలకు సంబందించిన శిలాఫలకాలపై తమ పార్టీకి చెందిన కార్పొరేటర్ల పేర్లను ఎందుకు పెట్టడంలేదంటూ బిజెపి శ్రేణులు మంత్రులను అడ్డుకొనేందుకు ప్రయత్నించాయి. ‘కేటీఆర్ గో బ్యాక్...గో బ్యాక్...’ అంటూ భాజపా శ్రేణులు నినదించడంతో అటు తెరాస శ్రేణులు కూడా ‘కిషన్ రెడ్డి గోబ్యాక్...’ అంటూ నినాదాలు చేశారు. తెరాస, భాజపా శ్రేణులు బాహాబాహికి దిగడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని చక్కదిద్దారు. 

గతంలో బిజెపి శ్రేణులు ఎప్పుడూ టిఆర్ఎస్‌ మంత్రుల కార్యక్రమాలకు ఈవిధంగా అడ్డుపడలేదు. కానీ దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల తరువాత నుంచి బిజెపి చాలా దూకుడుగా సాగుతోంది. బండి సంజయ్‌ నిత్యం సిఎం కేసీఆర్‌, ఆయన ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని తీవ్ర విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తుంటే, దిగువస్థాయి నేతలు, కార్యకర్తలు ఏ చిన్న అవకాశం లభించినా టిఆర్ఎస్‌ను ఢీకొంటున్నారు. తద్వారా టిఆర్ఎస్‌కు బిజెపియే ప్రత్యామ్నాయమని ప్రజలు భావించేలా చేయాలని ప్రయత్నిస్తున్నట్లున్నారు.