వరంగల్‌పై ఎర్రబెల్లి వరాల వాన!

వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు అధికార టిఆర్ఎస్‌ హామీల పర్వం మొదలైంది. ఇప్పటివరకు సిఎం కేసీఆర్‌ లేదా మంత్రులు కేటీఆర్‌, హరీష్‌రావు, ఈటల రాజేందర్‌ మాత్రమే ప్రజలకు వరాలు ప్రకటిస్తుండేవారు. కానీ రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా కావచ్చు ఇప్పుడు రాష్ట్ర పంచాయతీ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా వరాలు ప్రకటిస్తున్నారు.      

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుక్రవారం వరంగల్‌ 24వ డివిజన్ ప్రజాసంక్షేమ ప్రగతి యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ రూ.500 కోట్లతో వరంగల్ నగర అభివృద్ధికి  ప్రణాళిక సిద్ధం చేశామని చెప్పారు. అదేవిధంగా ఉగాది పండగ నుంచి వరంగల్ నగర పట్టణానికి శుద్ధిచేసిన తాగునీటిని సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. మహిళా సంఘాలకు రూ.3 లక్షల వరకు వడ్డీ లేని రుణం ఇస్తామని హామీ ఇచ్చారు. భాజపా పాలిత రాష్ట్రాలలో షాదీ ముబారక్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి సంక్షేమ పథకాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు.ఆ రాష్ట్రాలలో ఇటువంటి సంక్షేమ పధకాలు అమలుచేయలేని బిజెపి ఇక్కడ తమ ప్రభుత్వాన్ని తప్పు పడుతూ విమర్శలు చేస్తోందని ఎద్దేవా చేశారు. రాబోవు వరంగల్ కార్పోరేషన్ ఎన్నికలలో తెరాసను గెలిపించి నగర అభివృద్ధి చేసుకొందామని ప్రజలకు విజ్ఞప్తి చేసారు.