టిఆర్ఎస్‌కు ఇచ్చిన ఆ వాక్సిన్ బాగా పనిచేసింది: బండి

తెలంగాణ భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన శుక్రవారం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-ఛార్జ్ తరుణ్ చూగ్‌తో కలిసి ఖమ్మంలో పర్యటించారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడుతూ మంత్రి అజయ్ వైద్య కళాశాల పేరుతో నిరుపేదల భూములను ఆక్రమించారని ఆరోపించారు. తన భూఆక్రమణలు ఎక్కడ బయట పడతాయో అనే భయంతోనే సీపీఐ నుంచి తెరాసలోకి వెళ్లారని అన్నారు. వైద్య కళాశాల పేరుతో వైద్య విద్యార్దులను కూడా పువ్వాడ మోసం చేశారని ఆరోపించారు. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికలలో టిఆర్ఎస్‌పై కరోనా వాక్సిన్ ప్రయోగించామని అది సత్ఫలితాలు ఇచ్చింది కనుక ఖమ్మంలో కూడా మళ్ళీ అదే వాక్సిన్ ఇవ్వబోతున్నామని చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రంలో భాజపా అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మంత్రి అజయ్ అక్రమాలను బయటకు తీసి అరెస్టు చేస్తామని అన్నారు.