వరంగల్‌లో వ్యాగన్ సర్వీసింగ్ వర్క్ షాప్...కసరత్తు షురూ

వరంగల్‌ కోచ్ ఫ్యాక్టరీ దశాబ్ధాలుగా వినబడుతున్న మాట. కానీ ఆ కల సాకారం కాకమునుపే కోచ్ ఫ్యాక్టరీ వేరే రాష్ట్రానికి తరలిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి చేయడంతో దాని స్థానంలో రైల్వే వ్యాగన్ ఓవర్ హోలింగ్ వర్క్స్ షాప్ ఏర్పాటు చేసేందుకు అంగీకరించింది. దాని నిర్మాణం కోసం తెలంగాణ ప్రభుత్వం 150.5 ఎకరాలను భూమిని సేకరించింది. 

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మేయర్ గుండా ప్రకాష్ రావు, అర్బన్ జిల్లా కలక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, నగర క‌మిష‌న‌ర్ ప‌మేలా సత్పతి, టిఆర్ఎస్‌ ఎంపీలు బందా ప్రకాష్, పసునూరి దయాకర్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి తదితరులు గురువారం అర్బన్ జిల్లా కలక్టర్ కార్యాలయంలో ఆ భూమికి సంబంధించిన భూపత్రాలను కాజీపేట రైల్వే అధికారులకు అందజేశారు. 

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మీడియాతో మాట్లాడుతూ, “కోచ్ ఫ్యాక్టరీ కోసం ఎంతగానో పోరాడాము కానీ దానిని వేరే రాష్ట్రానికి తరలించడంతో దానికి బదులు వేగన్ వర్క్ షాప్ ఏర్పాటు కాబోతోంది. దాని నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందించడానికి సిద్దంగా ఉంది. కనుక వీలైనంత త్వరగా వేగన్ వర్క్ షాప్ ఏర్పాటు చేయాలని రైల్వే అధికారులకు, కేంద్రప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అవసరమైతే ఎంపీలు, అధికారులు ఢిల్లీ వెళ్ళి కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి చేసి వీలైనంత త్వరగా పనులు మొదలయ్యేలా చేస్తాము,” అని అన్నారు.