గుంటూరులో రాలిపోతున్న కాకులు...బర్డ్-ఫ్లూ వలనా?

దేశంలో  మధ్యప్రదేశ్, రాజస్థాన్‌, హర్యానా, కేరళ రాష్ట్రాలలో బర్డ్-ఫ్లూ వైరస్ కారణంగా లక్షలాది కోళ్ళు చనిపోతున్నాయి. మధ్యప్రదేశ్‌లో కొన్ని జిల్లాలలో కాకులు చనిపోతున్నాయి. కేరళలో కూడా బర్డ్-ఫ్లూ వ్యాపించినట్లు గుర్తించిన ప్రభుత్వం ఆ వ్యాది మరింత వ్యాపించకుండా అడ్డుకొనేందుకు వేలాది కోళ్ళు, బాతులను చంపించివేసింది. తాజాగా గుంటూరు జిల్లా కొల్లిపర మండలంలోని గుదిబండిపాలెం గ్రామంలో గల పాఠశాల ఆవరణలో ఆరు కాకులుచనిపోయి పడున్నట్లు గుర్తించిన స్థానికులు పశువైద్యశాఖ అధికారులకు సమాచారం అందించారు. 

ఆ శాఖ సంచాలకురాలు శ్రీలక్ష్మి హుటాహుటిన అక్కడకు చేరుకొని చనిపోయిన కాకులను సీల్డ్ కవర్స్ లో ప్యాక్ చేయించి వ్యాధి నిర్దారణకు పంపించారు. ఆమె అధికారులతో కలిసి పరిసర ప్రాంతాలలో ఉన్న కోళ్ళ ఫారంలకు కూడా వెళ్ళి పరిశీలించారు. కానీ కోళ్ళన్నీ ఆరోగ్యంగానే ఉన్నట్లు గుర్తించారు. చనిపోయిన కాకుల పరీక్షల నివేదిక వచ్చిన తరువాత అవి బర్డ్-ఫ్లూ వైరస్‌ కారణంగా చనిపోయా లేదా మరేదైనా కారణం చేత చనిపోయాయా? అనే విషయం మీడియా ద్వారా తెలియజేస్తామని శ్రీలక్ష్మి చెప్పారు. కనుక అనవసరమైన అనుమానాలు, అపోహలతో ఆందోళన చెందవద్దని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేసారు.