
సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రజల సమస్యల పరిష్కారం కోసం దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. బుధవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేఖరులతో మాట్లాడుతూ తాను ప్రభుత్వం ముందు 23 డిమాండ్లు ఉంచినట్లు తెలిపారు. ఈనెల 29వ తేదీ వరకు ఈ డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వానికి గడువు ఇచ్చానన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ఈనెల 30వ తేదీన లక్షమందితో సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియంలో ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు.
రైతు సమస్యలు, నిరుద్యోగ భృతి, గిరిజనులకు, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు వంటి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అలాగే అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల తరహాలోనే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను కులమతాలకు అతీతంగా మంజూరు చేయాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీలకు విసి నియమించాలని, కాలేజీలలో లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. గ్రామాలలో కొనుగోలు కేంద్రాలను ఎత్తివేయాలనే ఆలోచనను విరమించుకోవాలన్నారు. ఈ డిమాండ్లన్నీ గతంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలేనని జగ్గారెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్రంలో సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్ల తప్ప మిగిలిన ప్రాంతాలు అభివృద్ధి అంతగా అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. తెలంగాణ అంటే హైదరాబాద్, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాలు మాత్రమే కాదని రాష్ట్రంలో అన్ని జిల్లాలను సమానంగా అభివృద్ధి చేయాలని జగ్గారెడ్డి అన్నారు.