తెలంగాణ బిజెపి ఇన్ఛార్జ్ తరుణ్ చగ్ మూడు రోజుల పర్యటనలో భాగంగా నేడు హైదరాబాద్ రానున్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకోగానే నేరుగా పార్టీ కార్యాలయానికి వెళ్ళి అక్కడ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్, బిజెపి నేతలతో సమావేశమవుతారు. గ్రేటర్ ఎన్నికల తరువాత రాష్ట్రంలో మారిన రాజకీయ వాతావరణం, పార్టీ పరిస్థితుల గురించి చర్చిస్తారు. తరువాత ఖమ్మం, వరంగల్ మునిసిపల్ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు, నాగార్జునసాగర్ ఉపఎన్నికల గురించి చర్చిస్తారు. అనంతరం బండి సంజయ్‌తో కలిసి నిజామాబాద్ జిల్లాలోని బోధన్ చేరుకొని అక్కడ జరుగబోయే బహిరంగసభలో పాల్గొంటారు. శుక్రవారం ఖమ్మంలో, శనివారం వరంగల్‌లో పర్యటించి అక్కడ పార్టీ నాయకులతో సమావేశమయ్యి మునిసిపల్ ఎన్నికల గురించి చర్చించి, అవసరమైన సలహాలు సూచనలు ఇస్తారు.
ఇప్పటికే బండి సంజయ్ నిత్యం సిఎం కేసీఆర్‌ను, టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తూ టిఆర్ఎస్కు సవాళ్ళు విసురుతూ తీవ్ర ఆగ్రహం కలిగిస్తున్నారు. ఇప్పుడు తరుణ్ చగ్ కూడా ఈ మూడు రోజుల పర్యటనలో సిఎం కేసీఆర్‌ను, టిఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేయడం ఖాయం. కనుక మళ్ళీ టిఆర్ఎస్-బిజెపిల మద్య మాటల యుద్ధం మొదలవుతుంది. దాంతో రాష్ట్రంలో మళ్ళీ ఎన్నికల వేడి రాజుకొంటుంది.