
ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియను, భర్త భార్గవరామ్ సోదరుడు చంద్రహాసన్‌లను హైదరాబాద్ పోలీసులు బుదవారం అరెస్ట్ చేశారు. నిన్న రాత్రి సిఎం కేసీఆర్ బందువుల కిడ్నాప్ వ్యవహారంలో దుండగులు ఆమె భర్త భార్గవరామ్ పేరు ప్రస్తావించడంతో పోలీసులు ఆమెను అదుపులో తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించి ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం భార్గవరామ్ పరారీలో ఉన్నారు.
హఫీజ్‌పేటలోని కోట్లు విలువ చేసే 50 ఏకరాలపై నెలకొన్న భూవివాదం కారణంగానే సిఎం కేసీఆర్ సమీప బందువైన ప్రవీణ్ కుమార్, ఆయన ఇరువురు సోదరులు కిడ్నాప్ చేయబడినట్లు తెలుస్తోంది. కానీ దుండగులు వారిని కిడ్నాప్ చేసి ఎత్తుకొని పోయిన కొద్దిసేపటికే విడిచిపెట్టేయడంతో వారు ముగ్గురూ క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. సిఎం కేసీఆర్ సమీప బందువులే కిడ్నాప్‌కు గురవడం, ఈ వ్యవహారంలో ఏపీ మాజీమంత్రి అఖిలప్రియ పేరు పైకి రావడంతో రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించింది.
ఈ వ్యవహారంలో తమను అరెస్ట్ చేయడాన్ని భూమా అఖిలప్రియ తీవ్రంగా ఖండించారు. తాము గౌరవప్రదమైన కుటుంబానికి చెందినవారిమని, కిడ్నాపులు చేయించడం వంటి చట్టవ్యతిరేకమైన పనులు ఎన్నడూ చేయబోమని అన్నారు. తన భర్త భారవరామ్‌కు ఈ కిడ్నాపుతో ఎటువంటి సంబందమూ లేదని, ఎవరో ఉద్దేశ్యపూర్వకంగానే తమను దీనిలో ఇరికించాలని ప్రయత్నించారని అఖిలప్రియ ఆరోపించారు. త్వరలోనే ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో మీడియా ముందుకువచ్చి వివరిస్తానని అన్నారు.