
ఉద్యోగాలు భర్తీ చేయాలని నిరుద్యోగులు, తమకు నియామకపత్రాలు ఇచ్చి ఉద్యోగాలలో చేర్చుకోవాలని కోరుతూ ఎంపికైన అభ్యర్ధులు, ఇంకా అనేక సమస్యలపై పోరాడుతున్నవారు నిత్యం సిఎం కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్ ముందు ధర్నాలు చేస్తూనే ఉంటారు. కానీ ఎన్నికలలో గెలిచిన అభ్యర్ధులు తమ చేత ప్రమాణస్వీకారాలు చేయించాలని కోరుతూ ధర్నాలు చేయడం ఎప్పుడూ ఎవరూ చూడలేదు. తొలిసారిగా అదీ నేడు చూసే అవకాశం లభించింది.
జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో గెలిచిన 48 మంది బిజెపి కార్పొరేటర్లు తమను కార్పొరేటర్లుగా గుర్తిస్తూ తక్షణమే ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయించాలని డిమాండ్ చేస్తూ నేడు ప్రగతి భవన్ ముందు ధర్నాకు దిగారు. తాము కార్పొరేటర్లుగా ఎన్నికై నెల రోజులు కావస్తున్నా తమను కార్పొరేటర్లుగా నిర్ధారిస్తూ ప్రభుత్వం ఇంతవరకు గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేయలేదని, ప్రమాణస్వీకారం చేయించడంలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ప్రమాణస్వీకారం చేయించనప్పుడు మరి అంత హడావుడిగా జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ఎందుకు జరిపించారని వారు ప్రశ్నించారు. తమను ప్రలోభపెట్టి టిఆర్ఎస్‌వైపు తిప్పుకోవాలనే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేయకుండా తాత్సారం చేస్తోందని వారు ఆరోపించారు. కనుక ఇకనైనా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి తక్షణమే తమ చేత ప్రమాణస్వీకారాలు చేయించాలని వారు డిమాండ్ చేశారు.
ఈరోజు ప్రగతి భవన్ ఎదుట ధర్నా చేసేందుకు పోలీసులు అనుమతిచరని ముందే ఊహించిన బిజెపి కార్పోరేటర్లు అక్కడికి సమీపంలోగల హోటల్ హరిత ప్లాజాలో సమావేశం వంకతో చేరుకొని అక్కడి నుంచి హటాత్తుగా ప్రగతి భవన్ ముట్టడికి బయలుదేరి వెళ్లారు. కానీ వారు ఇటువంటిదేదో చేస్తారని ముందే పసిగట్టిన పోలీసులు ఎక్కడికక్కడ వారిని అరెస్ట్ చేసి పోలీస్ వ్యానులో గోషామహల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అయితే సమయానికి మహిళా పోలీసులు అందుబాటులో లేకపోవడంతో మహిళా కార్పొరేటర్లను ఎవరూ అడ్డుకోలేకపోయారు. దాంతో వారు వేగంగా ప్రగతి భవన్ వద్దకు దూసుకుపోయి సిఎం కేసీఆర్, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమాచారం అందుకొన్న మహిళా పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకొని వారినందరినీ కూడా వానులోకి ఎక్కించి గోషామహల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.