
ఒకప్పుడు ఎన్నికలంటే టిఆర్ఎస్కు ఆటవిడుపులా ఉండేవి కానీ దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల తరువాత ప్రతీ ఎన్నికలు అగ్నిపరీక్షగా మారాయి. వరంగల్, ఖమ్మం మునిసిపల్ పాలకమండలి పదవీకాలం మార్చిలో ముగుస్తుంది. కనుక ఫిబ్రవరిలోనే ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది.
వరంగల్ కార్పొరేషన్లో 58 డివిజన్లు ఉండగా 2016లో జరిగిన ఎన్నికలలో టిఆర్ఎస్-44, కాంగ్రెస్-4, బిజెపి-1, సీపీఏం-1 మిగిలిన 8 సీట్లను స్వతంత్రులు గెలుచుకున్నారు.
ఖమ్మం కార్పొరేషన్లో మొత్తం 50 డివిజన్లు ఉండగా 2016లో జరిగిన ఎన్నికలలో టిఆర్ఎస్-34, కాంగ్రెస్-10, వామపక్షాలు-4, వైసీపీ-2 గెలుచుకొన్నాయి.
దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల విజయోత్సాహంతో ఉన్న బిజెపి, ఆ ఎన్నికలలో ఎదురుదెబ్బలు తిన్న టిఆర్ఎస్ రెండు కూడా ఈ ఎన్నికలలో గెలిచేందుకు సర్వశక్తులు ఒడ్డి పోరాడనున్నాయి. ఒకవేళ ఆలోగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడు వస్తే అతను లేదా ఆమెకు ఈ ఎన్నికలు తొలి పరీక్షగా నిలుస్తాయి. అదీగాక ప్రతీ ఎన్నికలలో రెండో స్థానంలో నిలిచే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కనబడకుండాపోతోంది. కనుక ఈ ఎన్నికలలో తన సత్తా చాటుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కూడా గట్టిగానే ప్రయత్నించవచ్చు. కనుక ఈ ఎన్నికలు కూడా చాలా రసవత్తరంగా సాగడం ఖాయం.