షీ క్యాబ్ సర్వీసులు ప్రారంభించిన మంత్రి హరీష్‌రావు

సోమవారం సంగారెడ్డి పట్టణంలో రాష్ట్ర ఆర్ధికమంత్రి హరీష్‌రావు 18 మంది మహిళా లబ్దిదారులకు ‘షీ క్యాబ్’ (మహిళా టాక్సీలు)కార్లను అందజేశారు. అనంతరం మంత్రి హరీష్‌రావు షీ క్యాబ్ సర్వీసులను ప్రారంభించి, ఓ వాహనంలో కొంత దూరం ప్రయాణించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “మహిళలు అన్ని రంగాలలో పురుషులతో పోటీ పడుతున్నారు. ఇప్పుడు ‘షీ క్యాబ్స్’ పధకాన్ని కూడా అందిపుచ్చుకొనేందుకు పట్టణంలో మహిళలు ముందుకు రావడం చాలా హర్షణీయం. ముందుగా సంగారెడ్డి పట్టణంలోనే షీ క్యాబ్స్ సర్వీసులను ప్రారంభం అవుతుండటం చాలా సంతోషం కలిగిస్తోంది. ఈ పధకంలో కార్లు అందుకొన్న మహిళా లబ్దిదారులందరూ విజయవంతంగా నడిపించి రాష్ట్రంలో మిగిలిన మహిళలకు ఆదర్శంగా నిలవాలని కోరుకొంటున్నాను. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా అన్ని పట్టణాలు, నగరాలలో ఈ షీ క్యాబ్ సర్వీసులను ప్రారంభిస్తాము,” అని అన్నారు.

షీ క్యాబ్స్ నడిపేందుకు ముందుకువచ్చిన మహిళలు ఈ రంగంలో నిలద్రొక్కుకొనేందుకు అన్ని విధాల సహకరించవలసిందిగా మంత్రి హరీష్‌రావు హైదరాబాద్‌లోని ట్రాఫిక్ పోలీసులకు, ఐ‌టి కంపెనీలకు విజ్ఞప్తి చేసారు. 

ఎస్సీ మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సంగారెడ్డిలో ఈ పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించామని ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాబూరావు తెలిపారు. మొత్తం 25 మంది మహిళలను ఎంపిక చేసి డ్రైవింగ్ శిక్షణ ఇప్పించి డ్రైవింగ్ పరీక్షలు నిర్వహించగా వారిలో ఉత్తీర్ణులైన 18 మందికి 60 శాతం సబ్సీడీపై రూ.1.32 కోట్లు బ్యాంకు రుణాలతో కార్లు కొనుగోలు చేసి అందజేశామని చెప్పారు.