16.jpg)
తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ చేపట్టిన 48 గంటల దీక్ష సోమవారం సాయంత్రం విరమించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాట స్ఫూర్తితో రాష్ట్రంలో సమస్యల పరిష్కారానికి పోరాటం మొదలుపెట్టామని అన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ జనసమితి కార్యాచరణ ప్రణాళికను ఆయన మీడియాకు వివరించారు. జనవరి 10 నుంచి అన్ని పార్టీలు, సంఘాలు, పౌర వేదికలు, విద్యావేత్తలతో రౌండ్ టేబుల్ సమావేశాలు ఉంటాయన్నారు. జనవరి 20 నుంచి అన్ని గ్రామాలలో “బతుకు తెరువు..సాధన యాత్ర”ను ప్రారంభిస్తామని చెప్పారు. అలాగే రాష్ట్రంలో నిరుద్యోగులు, విద్యార్దులు, రైతులు తదితర వర్గాల ప్రజల సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్ళేందుకు ‘పోస్టుకార్డు ఉద్యమం’ కూడా చేపట్టనున్నట్లు తెలిపారు.
కేసీఆర్ నియంతృత్వ పాలనకు ఇక రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు. ఇక నుంచి తమ ప్రజాపోరాటాలను మరింత ఉదృతం చేస్తామని ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. తెలంగాణ ఉద్యమాలను మలుపు తిప్పిన 2011లో జరిగిన మిలియన్ మార్చ్ తరహాలో ఫిబ్రవరి 20వ తేదీన లక్షలమందితో “ఛలో హైదరాబాద్-ఛలో ట్యాంక్ బండ్” మిలియన్ మార్చ్ నిర్వహించనున్నట్టు అని తెలిపారు. ఆనాడు తెలంగాణ ఉద్యమాలను, ఇప్పుడు రాష్ట్రాన్ని కేసీఆర్ చేతుల్లో పెట్టి మోసపోయామని అన్నారు. ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు వంటి హామీలను అమలుచేయకుండా సిఎం కేసీఆర్ ప్రజలను మాయమాటలతో మోసం చేస్తున్నారని ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు.