గిరిజనులకు పులుల బెడద వదిలించరా? సోయం బాపూరావు

అదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు సీఎం కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం ఆయన జిల్లా కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ, జిల్లాలో గిరిజనుల పరిస్థితులు దయనీయంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పోడు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న గిరిజనులకు మహారాష్ట్ర అడవులలో నుంచి వస్తున్న పులులు పెద్ద సమస్యలా మారయన్నారు. పులుల భయంతో గిరిజనులు ఇండ్లలో నుంచి  బయటికి రావడానికే జంకుతున్నారని అన్నారు. ముఖ్యంగా ఉమ్మడి అదిలాబాద్, ఉమ్మడి వరంగల్ జిల్లా, మెదక్ జిల్లా, కరీంనగర్ జిల్లాలో ఇదివరకు ఎన్నడూ లేనంతగా పులుల సంచారం పెరిగిందన్నారు. ఆర్ధిక సమస్యలతో సతమతమవుతున్న గిరిజనులకు సరైన ఆహారం లేక ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారని, వారికి కనీసం వైద్య సదుపాయం కూడా లేదని ఇప్పుడు ఈ పులుల బెడదతో ఇళ్ళలో నుంచి బయట కాలుపెట్టలేకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారని సోయం బాపూరావు ఆవేదన వ్యక్తం చేశారు. కనుక అటవీశాఖ అధికారులు తక్షణం జిల్లాలో సంచరిస్తున్న పులులను బందించి దూరప్రాంతాలలో విడిచిపెట్టాలని విజ్ఞప్తి చేసారు. గిరిజనులకు పోడు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారని కనుక అవారిని ఆడుకోవలసిన బాధ్యత ప్రభుత్వంపై కూడా ఉందని సోయం బాపూరావు అన్నారు.