
మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఈరోజు తృటిలో కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న కారు వరంగల్- హైదరాబాద్ జాతీయ రహదారిపై జనగామలోని ఇందిరమ్మ కాలనీ వద్ద ఓ బైకును తప్పించబోయి బోల్తా పడింది. అయితే సమయానికి కారులో ఉన్న సేఫ్టీ బెలూన్స్ తెరుచుకోవడం వల్ల ఆయన స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకొన్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని, ఆయనతో సహా గాయపడ్డవారిని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం దొంతి మాధవరెడ్డిని హైదరాబాద్కు తరలించారు. తాజా సమాచారం ప్రకారం ఆయనకు ఎటువంటి ప్రమాదం లేదు. సాధారణ వైద్య పరీక్షలు చేసి ఇంటికి పంపించేస్తామని వైద్యులు చెప్పినట్లు సమాచారం.