తెలంగాణ వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదివారం జోగులాంబ గద్వాల జిల్లాలో పర్యటించి జిల్లాలోని ములకల మండలంలో పెద్దపల్లి, కుర్తీ రావు చెరువు గ్రామాలలో రైతు వేదికలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తెలంగాణకే తలమానికంగా మారనున్న కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించినందుకు, రైతులకు 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇచ్చినందుకు సిఎం కేసీఆర్‌ను అరెస్టు చేస్తారా? అని ప్రశ్నించారు. దుబ్బాకలో ఓ ఎమ్మెల్యే, జిహెచ్ఎంసిలో 48 కార్పొరేటర్లు గెలిచినంత మాత్రాన బండి సంజయ్ ఎగిరెగిరి పడటం సరికాదని, సీఎంని విమర్శించడం మానుకోవాలన్నారు. సీఎం కేసీఆర్‌ని విమర్శించడం మానుకొని అభివృద్ధిలో భాగస్వాములు కావాలని హితవు పలికారు.