
దేశంలో 135 కోట్లకుపైగా ఉన్న జనాభాలో ప్రతీ ఒక్కరికీ కరోనా టీకాలు వేసేందుకు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే విధివిధానాలను, నిర్ధిష్ట ప్రణాళికను రూపొందించుకున్నాయి. కేంద్రప్రభుత్వం సూచించిన మార్గదర్శకాల ప్రకారం ప్రాధాన్యతా క్రమంలో కరోనా టీకాలు వేస్తారు. దీనికోసం కేంద్రప్రభుత్వం ఓ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. టీకాలు వేసుకోవాలనుకొనేవారు ముందుగా తమ వివరాలను దానిలో నమోదు చేసుకోవలసి ఉంటుంది. అప్పుడు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ నుంచి మొబిల్ ఫోన్‌కు ఓ మెసేజ్ వస్తుంది. దానిలో సమీపంలోని టీకాలు వేసే కేంద్రం చిరునామా, టీకా వేసే తేదీ, సమయం వగైరాలుంటాయి. ఆ ప్రకారం ప్రజలు టీకా కేంద్రాలకు వెళ్ళి టీకాలు వేయించుకోవలసి ఉంటుంది.
కోవాక్సిన్ హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ కంపెనీలోనే తయారవుతుంది కనుక అక్కడి నుంచి ప్రత్యేక వాహనాలలో కోఠీలోని స్టేట్ వాక్సిన్ సెంటర్‌కు చేరుకొంటాయి. పూణేలో సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో ఉత్పత్తవుతున్న కొవీషీల్డ్ వాక్సిన్లను విమానాలలో ప్రత్యేక ఏర్పాట్లతో హైదరాబాద్ తీసుకువచ్చి కోఠీలోని స్టేట్ వాక్సిన్ సెంటర్‌కు తరలిస్తారు.
అక్కడి నుంచి ప్రత్యేక వాహనాలలో రాష్ట్రంలో ఏర్పాటు చేసిన 10 ప్రాంతీయ వ్యాక్సిన్ సెంటర్లకు తరలిస్తారు. అక్కడి నుంచి మళ్ళీ ప్రత్యేక వాహనాలలో జిల్లాలలోని ప్రాధమిక, సామాజిక ఆరోగ్యకేంద్రాలకు తరలించి నిలువచేస్తుంటారు. మళ్ళీ అక్కడి నుంచి ఎన్ని అవసరమైతే అన్ని చొప్పున స్థానిక వ్యాక్సిన్ సెంటర్లకు తరలించి వెంటవెంటనే ప్రజలకు వేస్తారు. కోఠీలోని స్టేట్ వాక్సిన్ సెంటర్ నుంచి స్థానిక వ్యాక్సిన్ సెంటర్లకు చేరేవరకు వ్యాక్సిన్లను 2-3 డిగ్రీల ఉష్ణోగ్రతలో భద్రపరిచి తరలిస్తారు.
కరోనా వాక్సినేషన్ కోసం రాష్ట్రంలో పాత 10 జిల్లా కేంద్రాలలో 40 క్యూబిక్ ఫీట్ విస్తీర్ణం కలిగిన వాక్-ఇన్-కూలింగ్-ఛాంబర్లు ఏర్పాటు చేశారు.
జిల్లాలలోని 950 ప్రాధమిక, 55 సామాజిక ఆరోగ్యకేంద్రాల నుంచి 33 జిల్లాలకు వ్యాక్సిన్ రవాణా చేసేందుకు 33 ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసి ఐస్ బాక్సులలో వ్యాక్సిన్లను స్థానిక టీకా కేంద్రాలకు పంపిస్తారు.
మొదటివిడతలో రాష్ట్రవ్యాప్తంగా 1,000 టీకా కేంద్రాలను ఏర్పాటు చేయబోతోంది. మున్ముందు భారీ సంఖ్యలో వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే టీకా కేంద్రాలను మరింత పెంచేందుకు వీలుగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రతీ టీకా కేంద్రంలో మూడు గదులు ఉంటాయి. మొదటి గదిలో వ్యాక్సిన్ కోసం వచ్చినవారు, మూడో గదిలో వ్యాక్సిన్ వేయించుకొన్నవారు (అరగంట) ఉంటారు. రెండో గదిలో వ్యాక్సిన్ వేస్తారు.