21.jpg)
తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్ పై కెసిఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమీక్ష సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ మార్, సంగారెడ్డి, సిద్దిపేట, నల్లగొండ, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం కేసీఆర్ వారితో మాట్లాడుతూ ధరణీ పోర్టల్‌తో రిజిస్ట్రేషన్ ప్రక్రియ చాలా చాలా వేగంగా జరుగుతోందని అన్నారు. రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధరణీ పోర్టల్‌ను మరింత మెరుగుపరచాలని అన్నారు. రైతుల సమస్యలు త్వరగా తీర్చేందుకే ధరణీ పోర్టల్‌ను తెచ్చామని అన్నారు. ధరణి పోర్టల్ వల్ల ఆశించినదానికంటే మెరుగైన ఫలితాలు వస్తున్నాయన్నారు. కేవలం రెండు నెలల్లోనే 1.6 లక్షల స్లాట్ బుక్ చేసుకున్నారని, ఇప్పటికే 80 వేల రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయని సిఎం కేసీఆర్ అన్నారు.
రాష్ట్రంలో ఐదు ఎకరాల లోపు రైతులే ఎక్కువగా ఉన్నారని సీఎం తెలిపారు. సాదాబైనామాల దరఖాస్తులను కలెక్టర్లు వెంటనే పరిశీలించి అర్హులైన రైతులకు యాజమాన్యపు హక్కులను కల్పించాలని ఆదేశించారు. అదేవిధంగా కోర్టులో ఉన్న వివాదస్పద భూముల కోసం జిల్లాకు ఒకటి చొప్పున ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం కేసీఆర్ జిల్లా కలెక్టర్లకు తెలిపారు.