మంత్రి కొప్పుల పర్యటనను అడ్డుకొన్న బిజెపి శ్రేణులు

రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్ బుధవారం జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక బిజెపి కార్యకర్తలు మంత్రిని అడ్డుకొనేందుకు ప్రయత్నించడంతో టిఆర్ఎస్‌, బిజెపి కార్యకర్తల మద్య ఘర్షణ మొదలైంది. భాజపా, తెరాస కార్యకర్తలు తీవ్రవాగ్వాదం జరగడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అక్కడే ఉన్న పోలీసులు అతికష్టం మీద వారిని చెదరగొట్టి పరిస్థితిని చక్కదిద్దారు. పోలీసులు కొంతమంది బిజెపి కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించడంతో మిగిలినవారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులకు, టిఆర్ఎస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ తర్వాత కొప్పుల ఈశ్వర్ గొల్లపల్లిలో మీడియా సమావేశం నిర్వహించారు.

 ఆయన మీడియాతో మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా ఉద్యోగులకు పిఆర్సీ 35 నుంచి 45శాతానికి పెంచిన ఘనత తమ ప్రభుత్వానిదేనని అన్నారు. తెలంగాణ ఏర్పడిన కొత్తలో పోలీస్ శాఖకు సరైన వాహనాలు లేక ఇబ్బంది పడుతుంటే నూతన వాహనాలను సమకూర్చిందన్నారు. పోలీస్ శాఖలో భారీగా ఉద్యోగాలు భర్తీ చేసిందన్నారు. ఆశావర్కర్లకు జీతాలు పెంచి ఆదుకొన్నది తమ ప్రభుత్వమేనని అన్నారు. ఈవిధంగా రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి కొప్పుల అన్నారు. కానీ బిజెపి నేతలు ఈవిధంగా ప్రజల మద్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ది పొందాలని ప్రయత్నిస్తున్నారన్నారు.