నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ ధర్నాలు

నియంత్రితసాగు విధానంతో రాష్ట్రంలోని రైతులు రూ.7,500 కోట్లు నష్టపోయారని చెప్పిన సిఎం కేసీఆర్‌ వారిని ఆదుకోకుండా, ఇకపై వారి పంటలను కొనుగోలుచేయమని చెప్పడాన్ని నిరాశిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేటి నుంచి జనవరి 7వరకు రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించినట్లు పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వమే పంటలు కొనుగోలు చేయాలని కోరుతూ తహశీల్దారులకు వినతిపత్రాలు అందజేస్తామని చెప్పారు. జనవరి 7లోగా ప్రభుత్వం స్పందించకపోతే జనవరి 11న అన్ని జిల్లా కేంద్రాలలో పెద ఎత్తున నిరసనలు తెలియజేస్తామని ఉత్తమ్‌కుమార్ రెడ్డి హెచ్చరించారు. జనవరి 18న రాష్ట్ర స్థాయిలో భారీ సభ లేదా ర్యాలీని నిర్వహిస్తామని తెలిపారు. రైతుపక్షపాతినని చెప్పుకొనే సిఎం కేసీఆర్‌ రైతులకు నష్టం కలిగించే నిర్ణయాలు ఎందుకు తీసుకొంటున్నారని ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రశ్నించారు.  

కేంద్రప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాల వలన రాష్ట్రంలో రైతులకు తీరని నష్టం కలుగుతుందంటూ భారత్‌ బంద్‌లో పాల్గొన్న టిఆర్ఎస్‌కు ఇప్పుడు రాష్ట్రంలో రైతుల సమస్యలపైనే నిరసనలు ఎదుర్కోవలసి వస్తుండటం విడ్డూరమే.