సిఎం కేసీఆర్‌ మరో కీలక నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం ప్రగతి భవన్‌లో సీఎం అధ్యక్షతన ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో సమావేశం జరిగింది. ఈ సమీక్ష సమావేశంలో సీఎం జలవనరుల శాఖను పునర్వ్యవస్థీకరించి భారీ, మధ్యతరహా, చిన్న ప్రాజెక్టులన్నిటినీ ఒకే గొడుగు కిందికి తీసుకురావాలని నిర్ణయించారు. ఈ ప్రతిపాదనపై సిఎం కేసీఆర్‌ ఆ శాఖ ఉన్నతాధికారుల అభిప్రాయాలు, సలహాలు, సూచనలు అడిగి తెలుసుకున్నారు. వీటి పర్యవేక్షణ కొరకు ఒక అధికారిని నియమించనున్నారు. 

రాష్ట్రంలోని జలవనరులను 19 ప్రాదేశిక ప్రాంతాలుగా విభజించి, ఒక్కో దానికి ఒక చీఫ్ ఇంజనీర్‌ను నియమించాలని సమావేశంలో నిర్ణయించారు.  ప్రస్తుతం రాష్ట్రంలో ముగ్గురు ఈన్సీలున్నారు. వారికి అదనంగా మరో ముగ్గురు అధికారులను నియమించాలని నిర్ణయించారు. ఈ ఆరుగురికీ 19 ప్రాదేశిక ప్రాంతాల పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించనున్నారు. జలవనరులశాఖ పునర్వ్యస్థీకరణ చేసినట్లయితే ఆ శాఖలో కొత్తగా 945 పోస్టులు ఏర్పాటు చేయవలసి ఉంటుందని అధికారులు సీఎంకు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం సాగు, త్రాగునీటికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని కనుక అన్ని పెండింగ్ ప్రాజెక్టులను రాబోయే వర్షాకాలంలోగా ఉన్నత నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని సిఎం కేసీఆర్‌ కోరారు. సీఎం మాట్లాడుతూ ప్రాజెక్టులను పూర్తిచేయాలని ఆదేశించారు.