
దేశంలో కరోనా కట్టడికి కేంద్రప్రభుత్వం గతంలో జారీ చేసిన మార్గదర్శకాలను 2021, జనవరి 31వరకు పొడిగించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ సోమవారం అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. దేశంలో కరోనా తీవ్రత, కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ కరోనా కేసులు పెరుగుతుండటంతో భారత్లో కూడా ఇంకా మరికొంతకాలం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది కనుక ఆంక్షలను యాధాతధంగా కొనసాగించాలని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలలోని ప్రభుత్వాలకు సూచించింది. ప్రజల చేత మాస్కూలు ధరింపజేయడం, శానిటైజేషన్, భౌతికదూరం పాటింపజేయడం వంటి జాగ్రత్తలను మరింత నిఖచ్చిగా పాటించాలని ఆదేశించింది. ముఖ్యంగా కంటెయిన్మెంట్ జోన్ల గుర్తింపు, వాటికి సంబందించిన జాగ్రత్తల విషయంలో మరింత ఖచ్చితంగా వ్యవహరించాలని ఆదేశించింది.
కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఈ మార్గదర్శకాలు, జాగ్రత్తల గురించి గతంలోలాగ ఇప్పుడు గట్టిగా వ్యవహరించడం లేదని అందరికీ తెలుసు. కేవలం జాగ్రత్తలు పాటించాలని చెప్పడంతో సరిపెడుతున్నాయిప్పుడు. తాంబూలాలు ఇచ్చేశాము తన్నుకు చావండిక... అన్నట్లు వ్యవహరిస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలలో సైతం కరోనా జాగ్రత్తలను పట్టించుకోవడం లేదిప్పుడు. కరోనా తగ్గుముఖం పట్టడంతో ప్రజలు కూడా మాస్కూలు లేకుండానే తిరుగుతున్నారు. కనుక ఆచరణలో పాటించని మార్గదర్శకాలను, ఆంక్షలను ఇంకా ఎంతకాలం పొడిగించినా వాటి వలన ఎటువంటి ఉపయోగమూ ఉండబోదు. కరోనాతో ప్రజలు, ప్రభుత్వాలు ఎన్నెన్ని కష్టాలు అనుభవించారో అందరూ ఓసారి గుర్తు చేసుకొంటే, మళ్ళీ అటువంటి దుస్థితి దాపురించకుండా జాగ్రత్తపడతారు. కాదని అలసత్వం ప్రదర్శిస్తే మళ్ళీ భారీ మూల్యం చెల్లించక తప్పదని అందరూ గ్రహించాలి.