ఆదిలాబాద్ జిల్లాలో తాటిగూడలో ఇటీవల మజ్లీస్ నేత ఫారూక్ అహ్మద్ జరిపిన తుపాకీ కాల్పులలో గాయపడిన జమీర్ (52) హైదరాబాద్‌లోని నీమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం కనుమూశాడు. ఫారూక్ అహ్మద్ మొదట తుపాకీతో కాల్పులు జరిపిన తరువాత మరికొందరిపై తల్వార్ (కత్తి)తో కూడా దాడి చేశాడు. ఆ దాడిలో జమీర్‌తో పాటు మోతేషాన్, మన్నాన్ అనే మరో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ప్రస్తుతం వారు కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
పోలీసులు కేసు నమోదు చేసుకొని ఫారూక్ అహ్మద్‌ను అదుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి ఆ తుపాకీని, తల్వార్‌ను స్వాధీనం చేసుకొన్నారు. ఈ కాల్పుల కారణంగా మళ్ళీ ఎటువంటి అవాంఛనీయమైన ఘటనలు జరుగకుండా నివారించేందుకు తాటిగూడలో భారీగా పోలీసులను మోహరించారు.