ఈ నెల28 నుంచి కరోనా టీకాల డ్రై రన్

సరిగ్గా ఏడాది క్రితం కరోనా పుట్టి యావత్ ప్రపంచదేశాలను గడగడలాడించింది. ఇంత తక్కువ సమయంలోనే శాస్త్రవేత్తలు రేయింబవళ్లు కృషి చేసి కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి వ్యాక్సిన్లు తయారుచేసారు. మన దేశంలోనే తయారైన కోవాక్సిన్, అమెరికాకు చెందిన ఆస్ట్రాజెనికాతో ఒప్పందంతో మన దేశంలో ఉత్పత్తి చేస్తున్న కొవీషీల్డ్ వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్‌ విజయవంతం అవడంతో వాటిని వినియోగించేందుకు కేంద్రప్రభుత్వం ఆమోదం తెలిపింది. 135 కోట్లకు పైగా జనాభా ఉన్న మన దేశంలో అందరికీ టీకాలు వేయాలంటే చాలా భారీ ప్రణాళిక, ఏర్పాట్లు అవసరం. కనుక కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు అందుకు ప్రణాళికలు, ఏర్పాట్లు చేసుకొని టీకాల్ వేసేందుకు సిద్దం అవుతున్నాయి. ముందుగా ఆంధ్రప్రదేశ్‌, అసోం, గుజరాత్‌, పంజాబ్ రాష్ట్రాలలో రెండేసి జిల్లాలలో ఈనెల 28,29న ప్రయోగాత్మకంగా టీకాలు వేసి వ్యాక్సిన్‌ పంపిణీ వ్యవస్థను, సిబ్బంది సన్నదత, వ్యాక్సిన్‌ ప్రభావం వంటివి పరీక్షించుకోవాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా ఎటువంటి లోపాలు, సమస్యలున్నట్లయితే ఇప్పుడే పరిష్కరించుకొని ఈ భారీ వ్యాక్సినేషన్ ప్రక్రియను ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్వహించేందుకు వీలుకలుగుతుంది.