కేసీఆర్‌ అన్నీ తనకే తెలుసనుకొంటాడు: కోదండరాం

తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని న్యూయార్క్‌లో డెమోక్రసీ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడితే అందరి కష్టాలు తీరిపోతాయని సిఎం కేసీఆర్‌ కధలు చెప్పారు. కానీ ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. పైగా తనే ఓ గొప్ప డాక్టర్, ఓ ఇంజనీర్, ఓ విద్యావేత్త అనుకొంటూ అధికారులను, మేధావులను అందరినీ పక్కన పెట్టి ఏకపక్షనిర్ణయాలు తీసుకొంటూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచేయడమే కాకుండా ప్రక్షాళన పేరిట ఒక్కో వ్యవస్థను అల్లకల్లోలం చేసేస్తున్నారు. సిఎం కేసీఆర్‌ విధానాలతో రాష్ట్రంలో పాలన రివర్స్ గేర్‌లో నడుస్తోందిప్పుడు.

మూడు నెలలుగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో రియల్ ఎస్టేట్ వ్యాపార రంగం సుమారు రూ.30,000 కోట్ల నష్టపోయింది. ఇకనైనా పాత పద్ధతిలోనే ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్ చేస్తున్నాము. విద్యావ్యవస్థ మూతపడటంతో వాటిల్లో పనిచేసే వేలాదిమంది ఉపాధ్యాయులు, భోదనేతర సిబ్బంది రోడ్డునపడ్డారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించకపోవడంతో విద్యార్దులు సతమతమవుతున్నారు.

ఎల్ఆర్ఎస్‌ పేరిట కేసీఆర్‌ ప్రభుత్వం పేదప్రజల నడ్డి విరుస్తోంది. నోటిఫికేషన్ల పేరుతో ఏళ్ళ తరబడి సాగదీయకుండా ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నిటినీ తక్షణమే భర్తీ చేయాలి. ప్రజల సమస్యలను, ఆకాంక్షలను గుర్తించకుండా నిరంకుశపాలన చేసిన ఎందరో పాలకులు కాలగర్భంలో కలిసిపోయారు,” అని అన్నారు.