
రేపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా రాష్ట్రంలో అన్ని వైష్ణవ దేవాలయాలలో ఉత్తరద్వారం తెరిచి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించనున్నారు. ఈ సందర్భంగా భద్రాచలంలో శ్రీరామచంద్రుని సన్నిధిలో వైభవంగా వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు సాగనున్నాయి. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా ఆలయాన్ని అందమైన విద్యుత్ దీపాలు, పూలతో అలంకరించారు.
వైకుంఠ ఏకాదశినాడు ఉత్తరద్వారం గుండా ఆలయంలోని శ్రీరామచంద్రస్వామివారిని దర్శనం చేసుకొంటే సకలపాపాలు హరించిపోయి మోక్షప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి ఉత్తర ద్వారదర్శనానికి చాలా పరిమిత సంఖ్యలో భక్తులను అనుమtతించనున్నారు. ముక్కోటి ఏకాదశి ముందు రోజున తెప్పోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది కనుక తాత్కాలిక పుష్కరిణిలో శ్రీ సీతారామలక్ష్మణ సమేత తెప్పోత్సవాన్ని నిర్వహించనున్నారు.
కోవిడ్19 కారణంగా ఈసారి భక్తులు లేకుండానే తెప్పోత్సవం నిర్వహిస్తున్నారు. భద్రాచల ఆలయ అధికారులు మీడియాతో మాట్లాడుతూ భక్తులు సహకరించాలని కోరారు.