
జిహెచ్ఎంసి మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నేడు మార్గదర్శకాలను విడుదల చేసింది. సెక్షన్ 88డి ప్రకారం గెలిచిన అభ్యర్థులను కార్పొరేటర్లుగా ప్రకటించిన నెలరోజులలోపే మొట్టమొదటి పాలకమండలి సమావేశం నిర్వహించి, సెక్షన్ 91 ప్రకారం మొట్టమొదటి సమావేశంలోనే మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగాలని ఎన్నికల సంఘం పేర్కొంది. ఆ రోజు నుంచి 5 ఏళ్ళపాటు కార్పొరేటర్ల పదవీకాలం ఉంటుందని ఎన్నికల సంఘం పేర్కొంది. ప్రస్తుత జిహెచ్ఎంసి పాలకమండలి పదవీకాలం 2021, జనవరి 10తో ముగియనుంది. కనుక జనవరి 10వ తేదీ తరువాత ఎప్పుడైనా గెలిచిన అభ్యర్ధులను కార్పొరేటర్లుగా ప్రకటిస్తూ ఎన్నికల సంఘం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయవచ్చు. అప్పటి నుంచి నెలరోజులలోగా పాలకమండలి సమావేశం నిర్వహించి మేయర్, డెప్యూటీ మేయర్‌లను ఎన్నుకోవలసి ఉంటుంది. అంటే ఫిబ్రవరి 10వ తేదీలోగా మేయర్, డెప్యూటీ మేయర్‌లను ఎన్నుకోవడంతో జీహెచ్‌ఎంసీకి కొత్త పాలకమండలి కొలువుతీరుతుంది.