రాష్ట్ర బిజెపి నేతలకు మంత్రి హరీష్‌ సూటి ప్రశ్న

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని హుగ్గెల్లి గ్రామంలో నిర్మించిన రైతు వేదిక భవనాన్ని రాష్ట్ర ఆర్ధికమంత్రి హరీష్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర బిజెపి నేతలకు కొన్ని సూటి ప్రశ్నలు వేశారు. 

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్, రైతుబందు, రైతుభీమా, రైతువేదికలు వంటివి అనేకం అందజేస్తూ వారిని కడుపులో పెట్టుకొని కాపాడుకొంటోంది. కానీ 17 బిజెపి పాలిత రాష్ట్రాలలో ఎక్కడా కూడా రైతులకు ఇటువంటి పధకాలు అమలుచేయడం లేదు. జహీరాబాద్‌కు పక్కనే కర్నాటకలోని బీదర్‌ ఉంది. కానీ కర్నాటకలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం రైతుల గోడు పట్టించుకోకపోవడం వలన ట్రాన్స్‌ఫార్మార్లు పేలిపోతున్నాయి. వ్యవసాయ మోటర్లు కాలిపోతున్నాయి. తెలంగాణలో రైతులకు మా ప్రభుత్వం ఇన్ని చేస్తున్నా విమర్శిస్తున్న రాష్ట్ర బిజెపి నేతలు వారి పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలో రైతుల దుస్థితి గురించి ఎందుకు మాట్లాడటం లేదు?బీజేపీ పాలిత రాష్ట్రాలలో అమలుచేయని అనేక పధకాలు తెలంగాణలో సిఎం కేసీఆర్‌ అమలుచేస్తుంటే మెచ్చుకోకపోగా ఎందుకు విమర్శలు గుప్పిస్తున్నారు?బీజేపీ పాలిత రాష్ట్రాల చేతగానితనానికి రాష్ట్ర బిజెపి నేతలు సిగ్గుపడాలి. ఈనెల 27న రైతుబందు సొమ్మును రైతుల ఖాతాలలో జమా చేస్తాము,” అని అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం, సిఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్న రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌, రాష్ట్ర బిజెపి నేతలు మంత్రి హరీష్‌రావు అడిగిన ఈ ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలు చెప్పగలిగితే వారి వాదనలను ప్రజలు నమ్మే అవకాశం ఉంటుంది కదా?