సుప్రీం ఆదేశాలతో విద్యుత్ ఉద్యోగుల సమస్య కొలిక్కి

గత ఐదేళ్లుగా ఏపీ తెలంగాణ రాష్ట్రాల విద్యుత్ ఉద్యోగుల విభజన సమస్య పరిష్కారం కాకుండా ఉంది. కాగా గత సంవత్సరం సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ డీఎన్ఆర్ ధర్మాధికారి ఏకసభ్య కమిటీ ఈ సమస్యపై ఓ నివేదిక ఇచ్చింది. కానీ దానిపై కూడా రెండు రాష్ట్రాలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవలసి వచ్చింది. 

ఈ సమస్య పరిష్కారం కోసమే ధర్మాధికారి ఏకసభ్య కమిటీని నియమించామని కనుక కమిటీ నివేదిక ప్రకారం రెండు రాష్ట్రాలు ఉద్యోగుల విభజనను అమలుచేయాల్సిందేనని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. తెలంగాణ విద్యుత్ శాఖ నుంచి మొత్తం 655 మంది ఏపీకి పంపించాలని, అదేవిధంగా ఏపీ నుంచి కూడా సమానసంఖ్యలో తెలంగాణాకు ఉద్యోగులను పంపించాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దీంతో ఐదేళ్లుగా నలుగుతున్న ఈ సమస్య ఓ కొలిక్కి వచ్చింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను తెలంగాణ ట్రాన్స్‌కో సిఎండి ప్రభాకర్ రావు జారీ చేశారు. తొలి విడతలో ఏపీ జెన్కో నుంచి 252 మంది తెలంగాణకు, తెలంగాణ జెన్కో నుంచి ఏపీ జెన్కోకు 252 మంది ఉద్యోగుల రిలీవ్ చేయడంతోపాటు వారిని ఉద్యోగాలలో చేర్చుకుంటామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.