18.jpg)
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్లపై ఇప్పటికే చాలా గందరగోళం నెలకొనాగా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు కూడా సక్రమంగా సాగట్లేదు. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు కొనుగోలు, అమ్మకందారుల ఆధార్, కులం, కుటుంబ సభ్యుల వివరాలను సేకరించరాదని, రిజిస్ట్రేషన్ వెబ్‌సైట్‌లో ఆ కాలమ్స్ వెంటనే తొలగించాలని తాజాగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో మళ్ళీ రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. హైకోర్టు సూచనల ప్రకారం వెబ్‌సైట్‌లో మార్పులు చేసి ముందుకు సాగాలా... లేదా హైకోర్టు నిర్ణయంపై సుప్రీంకోర్టులో సవాలు చేయాలా?లేదా ఈ సమస్యలను అధిగమించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఉన్నాయా? అనే అంశాలపై చర్చించేందుకు సిఎం కేసీఆర్ నేడు ప్రగతి భవన్‌లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు.
ఈ వ్యవహారంలో ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించడానికి రాష్ట్ర ప్రభుత్వం మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి సంప్రదించినట్లు సమాచారం. రాష్ట్రంలో గత మూడు నెలలుగా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో ప్రజలు, రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మూడు నెలల తరువాత మళ్ళీ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయనుకొంటే అనేక సమస్యలు ఎదురవుతుండటంతో ప్రజలు, రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలు ప్రభుత్వంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. రిజిస్ట్రేషన్లు ఆలస్యమవుతున్న కొద్దీ ప్రభుత్వంపై కూడా ఒత్తిడి పెరిగిపోతోంది. కనుక ఈరోజు ప్రగతి భవన్‌లో జరిగే ఉన్నత స్థాయి సమావేశంలో వ్యవసాయేతర ఆస్తులు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సజావుగా జరిగేందుకు తగిన పరిష్కారాలు కనుగొనవలసి ఉంది.