వనస్థలిపురంలో లబ్దిదారులకు ఇళ్ళు అందజేసిన కేటీఆర్‌

హైదరాబాద్‌ నగరంలోని వనస్థలిపురంలో రైతుబజార్ సమీపంలో నిర్మించిన 324 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళను మునిసిపల్ మంత్రి కేటీఆర్‌ ఈరోజు లాంఛనంగా ప్రారంభించి లబ్దిదారులకు వాటిని అందజేశారు. రూ.28.03 కోట్లు వ్యయంతో సుమారు రెండు ఎకరాల విస్తీర్ణంలో వీటిని నిర్మించారు. ఒక్కో బ్లాకులో సెల్లార్, స్టిల్ట్, తొమ్మిది అంతస్తులతో కూడిన 108 ఇళ్ళు చొప్పున మూడు బ్లాకులలో కలిపి మొత్తం 324 ఇళ్లను నిర్మించారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి సుమారు రూ.8.65 లక్షలు ఖర్చు అయింది. ప్రైవేట్ వెంచర్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ప్రతీ అపార్టుమెంట్‌లో లిఫ్ట్ సౌకర్యం, కాలనీలలో సీసీరోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రెయినేజ్,  ఫైర్ సేఫ్టీ, స్ట్రీట్ లైట్స్, సురక్షిత త్రాగునీటి వ్యవస్థలను ఏర్పాటు చేశారు. 

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ, “దేశంలో మరే ప్రభుత్వం కూడా ఈవిధంగా పేదలకు ఉచితంగా అన్ని సౌకర్యాలు కలిగిన ఇళ్ళను కట్టించి ఇవ్వడం లేదు. తెలంగాణలో పేద ప్రజలు కూడా ఆత్మగౌరవంతో జీవించాలనే ఉద్దేశ్యంతో సిఎం కేసీఆర్‌ ఈ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళ పధకాన్ని ప్రారంభించారు. ప్రభుత్వం బాధ్యతగా ఇళ్ళు కట్టించి మీకు అందజేసింది. వాటిని పరిశుభ్రంగా ఉంచుకోవలసిన బాధ్యత మీపైనే ఉంది. దీనికోసం మీరే కమిటీలు వేసుకొని నియమనిబందనలు ఏర్పాటు చేసుకొని కాలనీలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి,” అని అన్నారు.

ఈ కార్యక్రమానికి మేయర్ బొంతు రామ్మోహన్, మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ మల్లేశం, టిఆర్ఎస్‌ నేతలు కార్యకర్తలు హాజరయ్యారు.