తెలంగాణ పర్యటనకు వచ్చిన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఈరోజు కారు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకొన్నారు. ఈరోజు ఉదయం ఆయన కారులో హైదరాబాద్ నుంచి నల్గొండ వెళుతుండగా దారిలో చౌటుప్పల్ మండలం ఖైతాపురం గ్రామశివారులో జాతీయరహదారిపై కారు అదుపు తప్పి పల్టీ కొట్టింది. అదృష్టవశాత్తు ఆయన స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అంత ప్రమాదం జరిగినప్పటికీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఏమాత్రం భయపడకుండా కారులోనుంచి బయటకు వచ్చి ప్రమాదం ఏవిధంగా జరిగిందో డ్రైవరును అడిగితెలుసుకొని, ఓసారి కారును పరిశీలించి వేరే కారులో నల్గొండకు వెళ్ళిపోయారు. కారు స్టీరింగులో ఏదో సాంకేతిక సమస్య ఏర్పడి బిగుసుకుపోవడంతో మలుపువద్ద అదుపు తప్పి ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.