తెలంగాణలో నేటి నుంచి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు

తెలంగాణ ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టం ప్రకారం వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరిపించాలనే ఉద్దేశ్యంతో రాష్ట్రంలో సెప్టెంబర్ 8నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియను నిలిపివేసింది. కొత్త చట్టం అమలులోక్కి వచ్చినందున నేటి నుంచి రాష్ట్రంలోని 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో  వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు ప్రారంభించేందుకు సిఎం కేసీఆర్‌ ఆమోదం తెలిపారు. వీటికోసం గత మూడు నాలుగు రోజులుగా స్లాట్ బుకింగ్స్ ప్రక్రియను కూడా ప్రారంభించారు. హైకోర్టు ఆదేశాల మేరకు పాత ‘కార్డ్ విధానం’లోనే రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. వీటి కోసం రెవెన్యూ శాఖ కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ఆ వివరాలు:    

రిజిస్ట్రేషన్ల కోసం తప్పనిసరిగా ముందుగా స్లాట్ బుకింగ్ చేసుకోవలసి ఉంటుంది. 

స్లాట్ బుకింగ్స్ కొరకు ఆస్తిపన్నుల ఇండెక్స్ నెంబర్ తప్పనిసరి. లేకుంటే స్లాట్ బుకింగ్‌కు అనుమతించరు. 

ఒక్కో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో రోజుకి 24 స్లాట్స్ (రిజిస్ట్రేషన్లు) మాత్రమే జరుగుతాయి. అంటే ముందుగా స్లాట్ బుక్ చేసుకొన్నవారికే రిజిస్ట్రేషన్ చేసుకొనే అవకాశం లభిస్తుందన్నమాట. 

ఒక్కో రిజిస్ట్రేషన్ ప్రక్రియ 15 నిమిషాలలో పూర్తిచేయవలసి ఉంటుంది.  

రిజిస్ట్రేషన్లు పాత కార్డ్ విధానంలోనే జరుగుతాయి. 

 రిజిస్ట్రేషన్ ఫీజుల విషయంలో సబ్ రిజిస్ట్రార్ల విచక్షణాధికారాలను ప్రభుత్వం రద్దు చేసింది. నిబంధనల ప్రకారమే ఫీజు వసూలుచేయవలసి ఉంటుంది.