రేపే కొత్త పార్లమెంటు భవనానికి శంఖుస్థాపన

ప్రస్తుత, భవిష్యత్ అవసరాలకు తగిన్నట్లుగా కొత్త పార్లమెంటు భవనం నిర్మించాలని కేంద్రప్రభుత్వం సంకల్పించి దానికి టెండర్లు వగైరా ప్రక్రియ అంతా పూర్తి చేసింది.  గురువారం ఉదయం దానికి ప్రధాని నరేంద్రమోడీ శంఖుస్థాపన చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి హాజరుకావలసిందిగా కోరుతూ కేంద్రప్రభుత్వం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులకు ఆహ్వానాలు పంపించింది. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు, అధికార, ప్రతిపక్ష నేతలు, వివిద రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొనబోతున్నారు.

కేంద్రం పంపిన ఈ ఆహ్వానంపై సిఎం కేసీఆర్‌ స్పందిస్తూ, “ఈ మహత్కార్యంలో పాల్గొనే అవకాశం కలిగినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను. దేశరాజధానిలో ప్రస్తుతం ఉన్న ఈ వ్యవస్థ చాలా దశాబ్ధాలనాటిది నేటి అవసరళాకు సరిపోవడం లేదు కనుక దీనిని ఇప్పటికే నిర్మించి ఉండాలి. ఈ సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ మన దేశ సార్వభౌమత్వానికి, మన జాతి ఔనత్యానికి, బలమైన దేశానికి ప్రతీకగా నిలుస్తుంది. కనుక ప్రతిష్టాత్మకమైన, ఎంతో జాతీయ ప్రాధాన్యత ఉన్న ఈ ప్రాజెక్టు వీలైనంత త్వరగా పూర్తికావాలని నేను కోరుకొంటున్నాను,” అనే లేఖను తెలంగాణ సీఎంఓ అధికారిక ట్వీట్టర్ పేజీలో పోస్ట్ చేశారు. అయితే కరోనా భయాలు ఇంకా వెన్నాడుతున్నందున సిఎం కేసీఆర్‌తో సహా పలువురు ప్రముఖులు వర్చువల్ పద్దతిలో ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు.