5.jpg)
సిఎం కేసీఆర్ రేపు సిద్ధిపేట జిల్లాలో పర్యటించనున్నారు. ముందుగా సిద్ధిపేట శివారులో ఐటి టవర్, పారిశ్రామికవాడ నిర్మాణపనులకు సిఎం కేసీఆర్ శంఖుస్థాపన చేస్తారు. ఆ తరువాత అనంతరం జిల్లా కేంద్రంలోని నర్సపురంలో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళను ప్రారంభోత్సవం చేస్తారు. సిఎం కేసీఆర్ 9వ బ్లాకులోని మూడో నెంబర్ ఇంటి లబ్దిదారుచేత స్వయంగా గృహాప్రవేశం చేయిస్తారు. ఆ తరువాత 144 మంది లబ్దిదారుల చేత సామూహిక గృహాప్రవేశం చేయిస్తారు. సిఎం కేసీఆర్ వారందరికీ ఇళ్ళ పట్టాలను, కొత్తబట్టలు, గృహాప్రవేశానికి అవసరమైన పూజాసామాను అందజేస్తారు.
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళ గృహాప్రవేశ కార్యక్రమం ముగిసిన తరువాత సిఎం కేసీఆర్ పొన్నాలలో కొత్తగా నిర్మించిన టిఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని, మిట్టపల్లిలో కొత్తగా నిర్మించిన రైతువేదికను ప్రారంభిస్తారు. ఎన్సాన్‌పల్లి శివారులో నిర్మించిన ప్రభుత్వ వైద్యకళాశాలను ప్రారంభిస్తారు.
సుమారు రూ.163 కోట్ల వ్యయంతో 45 ఎకరాల విస్తీర్ణంలో జి+2 పద్దతిలో మొత్తం 2,460 డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్స్ నిర్మించారు. ఒక్కో బ్లాకులో 12 ఇళ్ళు చొప్పున మొత్తం 205 బ్లాకులుగా నిర్మించారు. ప్రతీ ఇంటికీ పైప్‌లైన్ ద్వారా వంట గ్యాస్ సరఫరా చేసేందుకు వీలుగా ప్రత్యేకవ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ ఇళ్ల కోసం మొత్తం 11,657 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 1,341 మందిని ఎంపిక చేసి రెండు విడతలలో ఇళ్ళు అందించబోతున్నారు.
సిఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా మంత్రి హరీష్‌రావు, జిల్లా కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి, సీపీ జోయల్ డెవిస్‌లు మంగళవారం ఆయా ప్రాంతాలకు వెళ్ళి ఏర్పాట్లను పరిశీలించారు.