తెలంగాణలో ఆయిల్‌పామ్ సాగు చేద్దాం: కేసీఆర్‌

తెలంగాణ వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు తేవాలని పట్టుదలగా ఉన్న సిఎం కేసీఆర్‌, గత సీజనులో దుడ్డుబియ్యానికి బదులు సన్నబియ్యం పండించాలని రైతులకు సూచించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రాష్ట్రంలో సాగునీటి సౌకర్యం ఏర్పడినందున 8 లక్షల ఎకరాలలో ఆయిల్‌పామ్ సాగు చేయించాలని సిఎం కేసీఆర్‌ నిర్ణయించారు. దీని కోసం మంచిసాగునీటి వసతి కలిసి, ఈ సాగుకు అనువైన భూములున్న ప్రాంతాలను ఎంపికజేసి అక్కడి రైతులకు 50 శాతం రాయితీ ఇచ్చి ఆయిల్‌పామ్ సాగు చేయించాలని సిఎం కేసీఆర్‌ నిర్ణయించారు. సిఎం కేసీఆర్‌ సోమవారం ప్రగతి భవన్‌లో వ్యవసాయశాఖమంత్రి నిరంజన్ రెడ్డి, వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి, ఉద్యానవనశాఖ ఎండీ వెంకట్రామిరెడ్డి, సీడ్ కార్పొరేషన్ ఎండీ కేశవులతో సమావేశమయ్యి ఆయిల్‌పామ్ సాగులో సాధ్యాసాధ్యాల గురించి, లాభనష్టాల గురించి లోతుగా చర్చించి ఇది రైతులకు లాభసాటిగానే ఉంటుందని దృవీకరించుకొన్న తరువాత ఈ నిర్ణయం తీసుకొన్నారు. కనుక రాష్ట్రంలో ఆయిల్‌పామ్ సాగు చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని సిఎం కేసీఆర్‌ వ్యవసాయ అధికారులను ఆదేశించారు.