నేడు భారత్‌ బంద్‌

కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయచట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో ఆందోళనలు చేస్తున్న రైతులు ఇచ్చిన పిలుపుమేరకు నేడు దేశవ్యాప్తంగా భారత్‌ బంద్‌ జరుగబోతోంది. దీనికి చాలా రాష్ట్రాలలో బిజెపియేతర పార్టీలు సంపూర్ణమద్దతు ప్రకటించాయి. ఈరోజు జరుగబోయే బంద్‌కు ట్రేడ్ యూనియన్లు, రైతు సంఘాలు, విద్యార్ధి సంఘాలు, రవాణా కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. బంద్‌ సందర్భంగా పలురాష్ట్రాలలో బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. రైల్వే సర్వీసులు మాత్రం యధాప్రకారం తిరుగుతాయని రైల్వేశాఖ ప్రకటించింది. వాటికి ఆటంకం కలిగించవద్దని ఆందోళనకారులకు విజ్ఞప్తి  చేసింది. 

ఏపీ, తెలంగాణలో అధికార వైసీపీ, టిఆర్ఎస్‌లు కూడా బంద్‌కు మద్దతు ప్రకటించాయి. ముఖ్యంగా.. కాంగ్రెస్‌, వామపక్షాలు ఈ బంద్‌ను విజయవంతం చేసి తమ సత్తాచాటుకోవాలని పట్టుదలగా ఉన్నాయి. కనుక కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న ఛత్తీస్‌ఘడ్‌, ఝార్‌ఖండ్, మహారాష్ట్ర, పంజాబ్ రాష్ట్రాలలో సంపూర్ణ బంద్‌ జరుగబోతోంది. బిజెపి పాలిత రాష్ట్రాలలో ప్రతిపక్షాలు, వాటి అనుబంద కార్మిక, రైతు, విద్యార్ధి సంఘాలు బంద్‌లో పాల్గొంటున్నాయి.    

సాధారణంగా బంద్‌ ఉదయం నుంచి సాయంత్రం వరకు జరుగుతుంది. కానీ ఈసారి కేవలం 3-4 గంటలు మాత్రమే బంద్‌ పాటించాలని పలు రాష్ట్రాలు నిర్ణయించడం కొంత ఊరటనిచ్చే విషయమే.