కేసీఆర్‌ కుటుంబానికే అన్నీ దక్కాలనుకొంటారు: విజయశాంతి

విజయశాంతి ఇవాళ్ళ ఉదయం బిజెపిలో చేరిన తరువాత ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “నేను నా రాజకీయజీవితం బిజెపితోనే ప్రారంభించాను. అయితే తెలంగాణ ఉద్యమసమయంలో నేను బిజెపిలో ఉండటం చేత నేను తెలంగాణను వ్యతిరేకిస్తున్నాననే దుష్ప్రచారం జరిగింది. అందుకే బిజెపిని వీడి ‘తల్లి తెలంగాణ’ పార్టీతో రాష్ట్ర సాధనకోసం పోరాడాను. అయితే తెలంగాణ ఉద్యమాలలో కేసీఆర్‌ తనకు, తన కుటుంబ సభ్యులకు మాత్రమే పేరు రావాలని, ఇతరులెవరికీ ఆ క్రెడిట్ దక్కకూడదనే ఆలోచనతో నావంటివారినందరినీ టిఆర్ఎస్‌లో చేర్చుకొన్నారు. నా పార్టీని టిఆర్ఎస్‌లో విలీనం చేయమని ఒత్తిడి చేశారు. నేను టిఆర్ఎస్‌లో చేరిన తరువాత నేను, కేసీఆర్‌ ఎంపీలుగా ఎన్నికయ్యాం. కానీ 2013లో కేసీఆర్‌ నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసి బయటకు పంపించేసి నేనే పార్టీ వీడివెళ్ళిపోయానని ప్రచారం చేశారు. తెలంగాణ ఇస్తే టిఆర్ఎస్‌ను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని సోనియా గాంధీకి హామీ ఇచ్చి తరువాత కేసీఆర్‌ యూటర్న్ తీసుకొన్నారు. తెలంగాణ బిల్లును ఆమోదించే సమయంలో కేసీఆర్‌ పార్లమెంటులో లేరు. ఉద్యమసమయంలో ఒక్క కల్వకుంట్ల కుటుంబానికి తప్ప రాష్ట్రంలో వేరెవరికీ పేరు రాకూడాదనుకొన్న కేసీఆర్‌ నేటికీ అలాగే వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో తనకు, తన కుటుంబాన్ని నిలదీసేవారు ఉండకూడదనే ఉద్దేశ్యంతో ఇతర పార్టీల నేతలను టిఆర్ఎస్‌లో చేర్చుకొని రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేశారు. కానీ ఆయన కోరిక ఎన్నటికీ నెరవేరదు. టిఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయ శక్తిగా రాష్ట్రంలో బిజెపి ఎదిగింది. సిఎం కేసీఆర్‌ను గద్దె దించుతాం. వచ్చే శాసనసభ ఎన్నికలలో రాష్ట్రంలో బిజెపియే అధికారంలోకి రాబోతోంది,” అని అన్నారు.