కాంగ్రెస్ పార్టీకి మరో షాక్... రెడ్డిగారు కూడా గుడ్ బై

దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓటమి ఆ పార్టీపై చాలా తీవ్ర ప్రభావం చూపింది. కాంగ్రెస్‌ నేతలు వరుసగా పార్టీకి రాజీనామాలు చేసి బిజెపిలో చేరిపోతున్నారు. విజయశాంతి సోమవారం ఉదయం ఢిల్లీలో జాతీయ ప్రధానకార్యదర్శి అరుణ్‌సింగ్‌, రాష్ట్ర బిజెపి నేతల సమక్షంలో కాషాయకండువా కప్పుకొని బిజెపిలో చేరారు. ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోకమునుపే కాంగ్రెస్ పార్టీకి ఇవాళ్ళ మరో ఎదురుదెబ్బ తగిలింది. ఏఐసీసీ సభ్యుడు, తెలంగాణ కాంగ్రెస్‌ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి కూడా ఇవాళ్ళ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామాలేఖను నేరుగా పార్టీ అధిష్టానానికే పంపించారు. ఆయన కూడా త్వరలో బిజెపిలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. వికారాబాద్‌ జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్‌ నేత చంద్రశేఖర్ రావు కూడా బిజెపిలో చేరేందుకు సన్నాహాలు చేసుకొంటున్నారు.

ఇలా...ఓ పక్క కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోతుంటే, మరోపక్క రేవంత్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జగ్గారెడ్డి, వి.హనుమంతరావు తదితరులు పిసిసి అధ్యక్ష పదవి కోసం పోటీపడుతుండటంతో కాంగ్రెస్ పార్టీలో చాలా విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి.