అమిత్ షాతో భేటీ అయిన విజయశాంతి

తెలంగాణ కాంగ్రెస్‌ ప్రచారకమిటీ ఛైర్‌ పర్సన్ విజయశాంతి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసారు. తరువాత నిన్న సాయంత్రం ఢిల్లీకి చేరుకొని ముందుగా కేంద్రహోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌, మాజీ ఎంపీ వివేక్ తదితరులు కూడా ఆమె వెంట ఉన్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బండి సంజయ్‌, వివేక్ తదితరుల సమక్షంలో ఆమె కాషాయకండువా కప్పుకొని బిజెపిలో చేరనున్నారు.

తెలంగాణలో కాంగ్రెస్‌ పరిస్థితి మునిగిపోతున్ననావలా మారడం, అదే సమయంలో బిజెపి మళ్ళీ బలం పుంజుకొని టిఆర్ఎస్‌కు ధీటుగా ఎదుగుతుండటంతో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నుంచి నేతలు బిజెపిలోకి క్యూకడుతున్నారు. ఇదివరకు టిఆర్ఎస్‌లోకి ఫిరాయింపుల కారణంగా బలహీనపడిన కాంగ్రెస్ పార్టీ కోలుకోకమునుపే మళ్ళీ బిజెపి నుంచి అదే సమస్య ఎదుర్కోవలసివస్తోంది.

గమ్మతైన విషయం ఏమిటంటే కాంగ్రెస్‌ పార్టీని టిఆర్ఎస్‌, బిజెపిలు రెండూ కూడా తీవ్రంగా ద్వేషిస్తుంటాయి. అది కూడా నిత్యం టిఆర్ఎస్‌, బిజెపిలతో పోరాడుతూనే ఉంటుంది. కాంగ్రెస్‌ పార్టీ కారణంగానే దేశం భ్రష్టుపట్టిపోయిందని సిఎం కేసీఆర్‌, అమిత్ షా, బిజెపి నేతలు తరచూ ఆరోపిస్తుండటం వింటూనే ఉంటాము. కాంగ్రెస్‌ అంటే అసమర్ధత, అవినీతికి మారుపేరు అనేవారు ఆ పార్టీ నేతలనే తెచ్చుకొని తమ తమ పార్టీలను బలోపేతం చేసుకోవాలనుకోవడం విడ్డూరం. అప్పుడు మూడు పార్టీల మద్య తేడా ఏముంటుంది?